ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావుతో కలిసి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల మద్దతుతో దేశ ప్రధానిగా ఎదిగారని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించాలంటే యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సాంకేతిక రంగం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.

సేవా జ్యోతి యాత్రలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోటేశ్వరరావు, రుద్ర ప్రదీప్‌, రామలింగేశ్వరరావు, మేకల నాగేందర్‌, ఆర్‌వీఎస్‌ యాదవ్‌, అల్లిక అంజి, మున్నా రవి, శ్యామ్‌ రాథోడ్‌, అనంతు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొని వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి తమ మద్దతు తెలిపారు