హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రియదర్శి పులికొండను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అభినందించారు. ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో హరీశ్ రావు ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు.

శంకరన్న పాత్రలో ప్రియదర్శి తెలంగాణ యాస, భాష, హావభావాలను చక్కగా ప్రదర్శించారని హరీశ్ రావు ప్రశంసించినట్లు సమాచారం. ‘బలగం’, ‘మల్లేశం’ వంటి చిత్రాల్లోనూ తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే పాత్రల్లో ప్రియదర్శి మెప్పించారని ఆయన అభినందించారు.

‘ది ప్యారడైజ్’ చిత్రంలో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర ప్రేక్షకుల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా నటుడు ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు, చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.